Karthika Puranam Day 7 Parayanam ( Nov 8th , 2024 )
కార్తీక పురాణం 7వ రోజు పారాయణం
7 వ అధ్యాయము : శివకేశవార్చనా విధులు.
వసిష్ఠ మహామును ఇట్లు చెప్పుచున్నారు. ’ ఓ జనక మహారాజా! వినుము కార్తీక మహాత్మ్యము ఇంకా చెప్పెదను. ప్రసన్న చిత్తుడవై వినుము. కార్తిక మాసమునందు ఎవరు కమలములచేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజింతురో వారి ఇంట పద్మవాసిని ఐన లక్ష్మీదేవి నిత్యమూ వాసము చేయును.
ఈ మాసములో భక్తితో తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాక, చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమిమీద జన్మించడు.
కార్తీక మాసమందు భక్తితో పండ్లను దానమిచ్చిన వానిపాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశించును. వుసిరిక కాయలతో ఉన్న వుసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు చూడడానికి కూడా శక్తికలిగి యుండడు.
కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసమందు బ్రాహ్మణులతోకూడా వనభోజన మాచరించు వాణి మహాపాతకములన్నీ నశించును. బ్రాహ్మణులతో కూడి వుసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదమొందును.
కార్తీక మాసములో భక్తితో శ్రీ హరి ఆలయమును మామిడి ఆకులతో తోరణము కట్టినవానికి మోక్షము దొరుకును. శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి పూజిమ్చినవానికి వైకుంఠమందు చిరకాలవాసము కలుగును. ఈ కార్తీక మాసమందు ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసినవారు పాపముక్తులై అశ్వమేధయాగఫలాన్ని పొందెదరు.
హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి పోదురు. ఈ మాసము స్నానము చేసి తడిబట్టతో నున్నవానికి వస్త్రదానము చేయువాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్ని పొందెదడు.
కార్తీక మాసమందు విష్ణువుయొక్క ఆలయ శిఖరమందు ధ్వజారోహణము చేయువాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి వలె నశించును. ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని పూజించిన పదివేల యజ్ఞములు చేసిన ఫలము కల్గును. ఈ మాసములో బృందావనమున ఆవు పేడతో అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరికి ప్రియురాలగును.
కార్తీక మాసమున విష్ణుభగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫమలునకు ప్రమాణము ఇంతింతని చెప్పుటకు బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా దీపము అనగా ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశీ తిథులందు సమర్పించు దీపము). ఈ నందాదీపము నశించినచో వ్రతభ్రష్టుడగును కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించడం వలెను.
కార్తీక మాసమందు శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు.
కార్తీక మందు విష్ణ్వాలయమందు మంటపంలో భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందెదరు. ఈ మాసములో మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లవలె నశించును. తులసీ గంధముతో సాలగ్రామమును పూజించువాడు పాపముక్తుడై విష్ణులోకాన్ని చేరగలడు.
హరి సన్నిధిలో స్త్రీగానీ, పురుషుడుగానీ నాట్యము చేసిన పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడ నశించును. ఈ మాసంలో భక్తితో అన్నదానమాచ రించువాని పాపములు గాలికి కొట్టబడిన మబ్బులవలె తొలగును.
కార్తీక మాసమందు తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్రభోజనము అన్నదానము అను నాలుగు ధర్మములు చేయవలెను. ఈ మాసమందు దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత చండాలుడగును. స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మిమ్చి తరవాత నూరు మార్లు కుక్కగా జన్మించును.
కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీ హరిని పూజించిన సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు పోవును. మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మించును. ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన సూర్యమండలమందు చిరకాలవాసి అగును. అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలిగలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.
స్త్రీలు మాలలచేత కానీ తులసీదళాల చేతకానీ, ఈ మాసమందు హరిని పూజిమ్చిన పాపవిముక్తులై వైకుంఠమును పొందెదరు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేసిన మాసమంతా స్నానమాచరించిన పుణ్యమును బొందును.
ఈ మాసమున శుక్ల ప్రతిపత్తిథినాడు, పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసమందు నెలరోజులూ కార్తీక మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశించును.
ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు ఏ సందేహములేకుండా నశించును. ఈ మాసమందు ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందును. ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదులచేత హరిని పూజించివాడు వైకుంఠాన్ని పొందును.
ఏడవ అధ్యాయము సమాప్తము…
స్వస్తీ..