Karthika Puranam Day 2 Parayanam ( Nov 3rd , 2024 )

కార్తీక పురాణం 2వ రోజు పారాయణం

2 వ అధ్యాయము : సోమవార వ్రత మహిమ, సోమవార వ్రతమహిమచే కుక్క కైలాసమేగుట.

( సోమవార వ్రత మహిమ)

కార్తీక పురాణము జనకా ఇంతవరకూ నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని. కార్తీకమాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు. కాన, సోమవార వ్రతవిధానమునూ, దాని మహిమనూ గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము.

కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని, పురుషుడు గాని ఏ జాతివారైనాగాని రోజంతయు వుపవాసముండి , నదీస్నానము చేసి తమశక్తి కొలదీ దానధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును.

ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి యంతయూ జాగరణ చేసి పురాణ పఠన మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి, తిలాదానము చేసి, తమశక్తి కొలదీ పేదలకు అన్నదానము చేయవలయును. అటుల చేయలేనివారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైననూ తృప్తిగా భోజనము పెట్టి, తాము భుజించవలయును.

ఉండగలిగిన వారు సోమవారమునాడు రెండుపూటలా భోజనము గాని యే విధమైన ఫలహారముగాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసినయెడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి, శివసన్నిధికి చేర్చును.

భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి, శివపూజ చేసినచో కైలాసప్రాప్తియు – విష్ణు పూజ చేసినచో వైకుంఠప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగ నొక యితిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను. శ్రద్ధగా వినుము.

కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట :

పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ వుండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు ‘స్వాతంత్ర్య నిష్ఠురి’, తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ యను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెండ్లి చేసెను.

ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములూ, శాస్త్రములూ అభ్యసించినవాడై నందున సదాచారపరాయణుడై యుండెను. అతడు భూతదయ గల్గినవాడు. నిత్య సత్యవాది. నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడునూ యగుటచే లోకులెల్లరూ నతనిని ‘అపరబ్రహ్మ’ అని కూడా చెప్పుకొనుచుండెడివారు.

ఇటువంటి ఉత్తమపురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో, కన్నుమిన్ను గానక పెద్దలను దూషించుచు – అత్తమామలను, భర్తను తిట్టుచు, గొట్టుచు, రక్కుచు పరపురుష సాంగత్యము గలదై, వ్యభిచారిణియై తన ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ యింటినుండి వెడలగొట్టిరి.

కాని, శాంతస్వరూపుడగు ఆమె భర్తకు మాత్ర మామొయందభిమానము పోక, ఆమె యెంతటి నీచకార్యములు చేసిననూ సహించి, చీ పొమ్మనక, విడువక, ఆమెతోడనే కాపురము చేయుచుండెను. కాని, చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళితనమున కేవగించుకుని – ఆమెకు “కర్కశ” అనే ఎగతాళి పేరును పెట్టుటచే – అది మొదలందరూ దానిని “కర్కశా” అనియే పిలుస్తూ వుండేవారు.

ఇట్లు కొంతకాలము జరిగినపైన – ఆ కర్కశ, ఒకనాటి రాత్రి యేకశయ్యపై తన భర్త గాఢనిద్రలో నున్న సమయమునుచూచి, మెల్లగాలేచి, తాళి కట్టిన భర్తయన్న విచక్షణ గాని, దయాదాక్షిణ్యాలు గాని లేక, ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యతడు చనిపోయెను.

ఆ మృతదేహమును యెవరి సహాయము అక్కరలేకనే, అతి రహస్యంగా దొడ్డిదారిని గొంపోయి వూరి చివరనున్న పాడునూతిలో బడవైచి పైన చెత్తాచెదారములతో నింపి, యేమియు యెరుగని దానివలె యింటికి వచ్చెను. ఇక తనకు యే యాటంకములు లేవని యింకా విచ్చలవిడిగా సంచరించుచు, తన సౌందర్యం చూపి యెందరినో క్రీగంటనే వశపరచుకుని, వారల వ్రతమును పాడుచేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచూ వర్ణసంకరురా లయ్యెను.

అంతియే గాక పడుచుకన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను, తనమాటలతో చేరదీసి, వారిక్కూడా దుర్భుద్ధులు నేర్పి పాడుచేసి, విటులకు తార్చి ధనార్జనకూడా చేయసాగెను.

జనకమహారాజా! యవ్వనబింకము యెంతో కాలముండదుగదా! కాలమొక్కరీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది.

శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము రసికారుట ప్రారంభమయ్యెను. దానికితోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినమూ శరీరపటుత్వము కృశించి కురూపియై భయంకర రోగములతో బాధ పడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా యెన్నో విధాల తృప్తి కలిగించిన విటులు యే ఒక్కరూ యిపుడామెను తొంగిచూడరైరి.

ఆ పరిసర ప్రాంతానికి వెళ్లిన యెడల తమ నెటులైననూ పలుకరించునని, ఆ వీధిమొగమైననూ చూడకుండిరి. కర్కశ యిటుల నరక బాధలనుభవించుచూ, పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికినన్నాళ్లూ ఒక్కనాడైనా పురాణ శ్రవణమైననూ చేయని పాపిష్టురాలుగదా! చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజగు యముని సన్నిదిలో నుంచగా, యమధర్మరాజు, చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి “భటులారా! ఈమె పాపచరిత్ర అంతింతకాదు.

వెంటనే యీమెను తీసుకువెళ్లి యెఱ్ఱగా కాల్చిన యినుపస్తంభమునకు కట్టబెట్టుడు” అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను – యమభటూలామెను యెఱ్ఱగా కాల్చిన యినుపస్తంభమును కౌగలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టిచంపినందుకు గాను ఇనుపగదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి. తల్లి దండ్రులకూ, అత్తమామలకూ యపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ, చెవులలోనూ పోసి,యినుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి.

తుదకు కుంభీపాకమను నరకములో వేయగా, అందు యినుపముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జెఱ్ఱులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు యిటు యేడు తరాలవాళ్లు అటు యేడు తరాలవాళ్లు నరకబాధలు పడుచుండిరి.

ఈ ప్రకారముగా నరకబాదల ననుభవించి, కడకు కళింగదేశమున కుక్క జన్మ యెత్తి, ఆకలి బాధపడలేక యిల్లిల్లూ తిరుగుచుండగా, కఱ్ఱలతో కొట్టువారు కొట్టుచూ, తిట్టువారు తిట్టుచూ, తరుమువారు తరుముచూ వుండిరి. ఇట్లుండగా ఒకానొకనాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి, సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి, కాళ్లుచేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున యీకుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను.

వ్రతనిష్టాగరిష్టుడైన అ విప్రుని పూజావిధానముచే జరిపించిన బలియన్నమగుటచేతనూ, ఆరోజు కార్తీకమాస సోమవారమగుటవలనను, కుక్క ఆరోజంతయు ఉపవాసముతో వుండుటవలననూ, శివపూజా పవిత్రస్థానమైన ఆ యింటదొరికిన ప్రసాదము తినుట వలననూ, ఆ శునకమునకు జన్మాంతర జ్ఞాన ముద్భవించెను. వెంటనే ఆ శునకము ‘విప్రకులోత్తమా! నన్ను కాపాడుము ‘ అని మొరపెట్టుకొనెను.

ఆ మాటలు బ్రాహ్మణుడాలకించి, బైటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరల ‘రక్షింపుము, రక్షింపుము’ అని కేకలు వినబడెను. మరల విప్రుడు బైటకు వచ్చి ‘ఎవరు నీవు ! నీ వృత్తాంతమేమి?’యని ప్రశ్నించగా, యంత నా కుక్క “మహానుభావా! ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలముందు విప్రకులాంగనను నేను.

వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను జంపి, వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత, యమదూతలవల్ల మహానరక మనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల యీ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కర్తీక సోమవార వ్రతము చేసి యిచ్చట వుంచిన బలియన్నమును తినుటవలన నాకీజ్ఞానోదయము కలిగినది.

కావున ఓ విప్రోత్తమా! నాకు మహోపకారంగా, మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొకటి యిచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను” యని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మాహాత్మ్యమున్నదని గ్రహించి, ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారబోయగా వెంటనే ఒక పుష్పకవిమానము అక్కడకు వచ్చెను.

ఆమె అందరికీ వందనము జేసి అక్కడివారందరూ చూచుచుండగనే యా విమానమెక్కి శివసాన్నిధ్యము కేగెను.వింటివా జనక మహారాజా! కావున, నీవును ఈ కార్తీక సోమవారవ్రత మాచరించి, శివసాన్నిథ్యమును పొందు – మని వశిష్ఠులవారు హితబోధ చేసి, యింకనూ ఇట్లు చెప్పదొడంగిరి.

స్కా0దపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి రెండవ అధ్యాయము
రెండవ రోజు పారాయణము సమాప్తము.

Leave a Comment