కార్తీక పురాణం 10వ రోజు పారాయణం
10 వ అధ్యాయము : అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము.
(అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము)
జనకుడు వశిష్ఠులవారిని గాంచి “మునిశ్రేష్ఠా! యీ అజామీళుడు యెవడు? వాడి పూర్వజన్మ మెటువంటిది? పూర్వజన్మంబున నెట్టిపాపములు చేసియుండెను. ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించవలసినది” గా ప్రార్థించెను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.
జనకా! అజామీళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి, “ప్రభూ! తమ ఆజ్ఞ ప్రకారము అజామీళుని తీసుకొనివచ్చుటకు వెళ్లగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళుని విమానమెక్కించి వైకుంఠమునకు దీసుకొనిపోయిరి.
మేము చేయునదిలేక చాలా విచారించుచూ యిచటకు వచ్చినారము” అని భయకంపితులై విన్నవించుకొనిరి.
“ఔరా! ఎంతపని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును” అని యముడు తన దివ్య దృష్టితో అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, “ఓహో! అదియా సంగతి! తన అవసానకాలమున ‘నారాయణా’ అని వైకుంఠవాసుని నామస్మరణజేసి యుండెను.
అందులకుగాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొనిపోయిరి. తెలియక గాని, తెలిసి గానీ మృత్యుసమయమున హరినామ స్మరణ మెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజామీళునకు వైకుంఠప్రాప్తి కలిగెను కదా!” అని అనుకొనెను.
అజామీళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందంచేతను, సిరిసంపదలచేతనూ, బలముచేతను గర్విష్ఠియై వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయముయొక్క ధనము నపహరించుచూ, శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను బెట్టక, దుష్టసహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు.
ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణస్త్రీతో రహస్య సంబంధముండెడిది. అమె కూడా అందమైన దగుటచే చేయునదిలేక ఆమె భర్త చూచియూ చూడనటులనుండి భిక్షాటనకై వూరూరా తిరుగుచూ ఏదోవేళకు యింటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు.
ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్దమూటతో బియ్యము కూరలూ నెత్తినిబెట్టుకొని వచ్చి అలసిపోయి “నాకు యీరోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంటచేసి పెట్టుము” అని భార్యతో ననెను. అందులకామె చీదరించుకొనుచు, నిర్లక్ష్యముతో కాళ్లు కడుగుకొనుటకు నీళ్లుకూడా యీయక, అతని వంక కన్నెత్తియైననూ చూడక విటునిపై మనస్సు గలదియై మగని తూలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కఱ్ఱతో బాదెను.
అంత ఆమె భర్త చేతినుండి కఱ్ఱ లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బైటకుత్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునదిలేక భార్యపై విసుగు జనించుటవలన ఇక యింటిముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటినుండి వెడలిపోయెనుగదా యని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి యుండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను.
అతనిని పిలిచి “ఓయీ! నీవీరాత్రి నాతో రతిక్రీడ సలుపుటకుర” మ్మని కోరెను. అంతనా చాకలి “తల్లీ! నీవు బ్రాహ్మ్ణణపడతివి. నేను నీచకులస్తుడను, చాకలివాడిని. మీరీవిధముగా పిలుచుట యుక్తముగాదు. నేనిట్టి పాపపు పని చేయజాలను” అని బుద్ధిచెప్పి వెడలిపోయెను.
ఆమె ఆ చాకలి వాని అమాయక త్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటనుండి బయలుదేరి ఆగ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంచ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతయూ అతనితో గడిపి వుదయమున యింటికి వచ్చి “అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను యింటినుండి వెడలగొట్టి క్షణికమయిన కామవాంఛకు లోనయి మహాపరాధము చేసితిని” అని పశ్చాత్తాపమొంది,
ఒక కూలివనిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపెను. కొన్నిదినములు గడిచిన తర్వాత భర్త యింటికిరాగా పాదములపైబడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటినుండి యామె మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను.
కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరక కూపములబడి నానాబాధలు పొంది మరల నరజన్మ మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీకమాసమున నదీస్నానము చేసి దేవతాదర్శనము చేసి యుండుటవలన నేడు జన్మముల పాపములు నశించుటచేత అజామీళుడై పుట్టెను.
ఇప్పటికి తన అవసానకాలమున ‘నారాయణా’ అని శ్రీహరిని స్మరించుటవలన వైకుంఠమునకు పోయెను.
బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనల ననుభవించి ఒక మాలవాని యింట జన్మించెను. ఆమాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రిగండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను.
మాలవాడా శిశువును తీసుకుపోయి అడవియందు వదలిపెట్టెను. అంతలో నొక విప్రుడు ఆదారినపోవుచు పిల్లయేడుపు విని జాలికలిగి తీసుకుపోయి తన యింట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వజన్మవృత్తాంత మిదియే.
నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీకమాస స్నానప్రభావముల వలన నెటువంటివారైననూ మోక్షమొందగలరు. గాన, కార్తీకమాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వార లిహపర సుఖములు పొందగలరు.
దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము.
స్వస్తి…